నాన్న ప్రేమ

రవి

"నన్ను ఎవరో తాకిరి, కన్ను  ఎవరో కలిపిరి,

చూపులోనె ఆపలేని మత్తు మందు జల్లిరి,

 

నన్ను ఎవరో చూసిరి, కన్నె మనసే దోచిరి,

చూపులోనె ఆపలేని మత్తు మందు జల్లిరి,"

  అత్త చేతిలో ఉన్న మర్ఫి బ్రాండు ట్రాన్సిస్టరు లోంచి వినపడుతున్న ఘంటసాల, సుశీల గొంతుకల లోని మార్ధవం నా కాళ్ళను అటు వైపుకి లాగింది. అప్పుడు  సుమారు రాత్రి 8గంటల 10 నిముషాలు అవుతున్నది. ఇంతలో వ్యాఖ్యాత  మాటలు 'మీరు వింటున్న పాట  సత్తెకాలపు సత్తెయ్య చలన చిత్రము లోనిది.,గాయకులు ఘంటసాల , సుశీల,  వ్రాసినది ఆరుద్రగారు , సంగీత దర్శకుడు ఎం ఎస్ విశ్వనాథన్ గారు ' అని వినపడుతుండగ,   'అమ్మా' అని గట్టిగా బాధతో  అరిచాను . కేక విన్న అత్త వెంటనే పట్టుకొన్న ట్రాన్సిస్టరును కింద పడవేసి 'ఏమయ్యింది కిష్టయ్య ' అని ఆదుర్దాగ అడిగింది. అప్పుడే వెళ్ళుతున్న  పెద్ద తేలు నన్ను కాలి మీద కాటు వేసింది. గుడ్డి దీపము వెలుగులో దాని చూసిన అత్త పిల్లవాడికి తేలు కుట్టిందని చెప్పింది. ఇంట్లోని అందరు హఠాత్తుగా జరిగిన   సంఘటనతొ విభ్రాంతులై చూస్తున్నారు.అలాగే గుడ్డి (బుడ్డి) దీపపు వెలుగులో తేలును వెతక సాగారు.

              'అమ్మా' అని అరుస్తు బాధ పడుతున్న నన్ను తన భుజాల మీద వేసుకొనిఏమి కాలేదు, ఏమి భయం లేద’ని చెప్పుతు వెంటనే  ఊరి చివరి ఉన్న రమణయ్య దగ్గరకు పరిగెత్తాడు నాన్న. ఎప్పుడు కఠినముగ వ్యవహరించె నాన్న నళినముగ మాట్లాడటం నాకు ఆశ్చర్యము కలిగించినను,ఒక విదంగ ఆనందము వేసింది, భాధలో కూడ.’ ఏమయ్యింది సామి’, అని అడిగిన రమణయ్యకు  మా అబ్బాయికి  తేలు కుట్టిందిరా’, అని నాన్న చెప్పాడు. అందుకతను ఏమి పర్వలేదు సామి, నేను తేలు మంత్రం వేస్తాను, వెంటనె తగ్గిపోతుంది అని చెప్పి, వేపాకులు, పసుపును తీసుకొని నీళ్ళల్లొ వెసి, నీళ్ళను నా కాళ్ళ మీద చల్లుతు, ఏదొ గొణగసాగాడు.  నాకు భాదలొ విషయం తెలిసెలోపె   నేను మైకం లోకి వెళ్ళీపోయాను. తిరిగి  స్పృహలోకి  వచ్చేటప్పటికి ఇంట్లో మంచము మీద పడుకొని ఉన్నాను. అందరు మంచము పక్కన నిల్చుని ఉన్నారు.

              'మహమాయికి ముడుపు కడ్తాను, పిల్లవాడికి ఏమి కాకూడదు’ అని అమ్మ ఏడుస్తు చెప్పటం, ‘ఏమి కాదులే, నీవు ఏడుపు ఆపి గుక్క పెడ్తున్న చిన్న పిల్లను సముదాయించు’ అని నాన్న విసుగ్గ పలకటం వినపడుతుండగా నేను మత్తు(నిద్ర)లొకి జారిపోయాను. ‘అది మైకం తేలులా ఉన్నట్టుంది, నన్ను కుట్టాల్సింది వాడిని కుట్టింద’ని అత్త చెప్పుతుండగ నాకు మెలకువ వచ్చింది. అదే సమయంలో నాన్నమ్మ అమ్మతోనీ మురుగుడిని వేడుకో, ఆయనే తప్పకుండ  కాపాడుతాడు.అసలు వీడి పుట్టెంట్రుకలు (పుట్టు వెంట్రుకలు) స్వామిమలైలో తీయలేదు, అందుకనె విషప్పురుగు వీడిని కుట్టింద’ని చెప్పుతున్నది. మంచం పక్కనె అందరు నిలబడి చూస్తుండగ మెల్లగా నిద్రలోకి(మత్తు)జారిపోయాను.నాకు మెలకువ రాగానే,అర్దరాత్రి ఒంటి గంట అయ్యింది, పిల్లవాడికి చెమటలు పోస్తున్నాయి, ఇంకేమి సమస్య లేద’ని అత్త చెప్పుతున్నది.   

నాకు జరిగినదంత ఏమి గుర్తు లేదు కాని నాన్న భుజాల మీద సేద తీర్చుకున్న ఆ సమయం మాత్రం గుర్తుకు వచింది. తృప్తిగా ఇలా నాన్న భుజాల మీద ఉండి పోతె భాగుండునని అనిపించింది. ఎన్నో బరువులు మోసిన ఆ భుజ స్కందాల మీద నన్ను మోస్తుంటె ఎంతొ తృప్తి,ఎంతొ ఆనందం నన్ను ఏదొ లోకాలకు తీసుకెల్లటం జరిగింది. ఈ సంఘటన జరిగి 52 సంవత్సరాలు అయ్యినప్పటికి ఆ తీయని గత స్మృతులు నన్నుఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. 

 

(నాన్నకు ప్రేమతొ)


Comments

Popular posts from this blog

వట్రువ